అయోధ్య రామ మందిర విరాళాల్లో అక్రమాలు.. సిట్ విచారణకు యోగి సర్కార్ ఆదేశం

అయోధ్య రామ మందిర విరాళాల్లో అక్రమాలు.. సిట్ విచారణకు యోగి సర్కార్ ఆదేశం

లక్నో: అయోధ్య రామ మందిరం విరాళాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామ మందిర ప్రాంగణంలోని విరాళాల పెట్టెల నుంచి డబ్బు మాయమైందని ప్రతిపక్ష సమాజ్‎వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దీంతో ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి.. వాస్తవాలను నిర్ధారించుకోవడానికి విచారణకు ఆదేశించాలని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్న డిమాండ్, ట్రస్ట్ అభ్యర్థన మేరకు రామ మందిర విరాళాల వివాదంపై యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 

అయోధ్య రామ మందిర విరాళాలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్‌ ముగ్గురు సభ్యులతో కూడిన సిట్‎ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నివేదిక అందజేయాలని ప్రభుత్వం సిట్‎ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసును సీరియస్‎గా తీసుకున్న సిట్.. అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్‌కు సంబంధించిన విరాళాలు, ఆర్థిక నిర్వహణపై ఫోకస్ పెట్టింది.

►ALSO READ | భారతదేశ సంస్కరణల ఎక్స్‌ప్రెస్ ఆగదు.. మాతో కలిసి పని చేసేందుకు రండి: ప్రధాని మోడీ

క్షేత్రస్థాయిలో దర్యాప్తు వేగవంతం చేసింది. విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న పలువురు ఉద్యోగులను సిట్ విచారిస్తోంది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర సాంకేతిక, భౌతిక సాక్ష్యాలను పరిశీలిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రుదౌలిలోని శుజగంజ్ ప్రాంతం మీనాపూర్ ఫగోలి నివాసి అయిన లవ్ కుష్ అనే వ్యక్తిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో అతనికి ఉన్న సంబంధాల గురించి దర్యాప్తు అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. విచారణ సమయంలో కొంత నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇతర వ్యక్తుల ప్రమేయంపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.